Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా అన్న నన్ను రెండు సార్లు ఉరితీసి చంపబోయాడు.. 20 నిమిషాల పాటు నా భర్తను రాడ్డుతో కొట్టి చంపాడు: నాగరాజు భార్య సుల్తానా

My Brother Tries To Hang Me Says Sultana
  • చంపేస్తామంటూ మా అమ్మ కూడా బెదిరించిందన్న సుల్తానా 
  • పెళ్లి వద్దని వారించినా నాగరాజు వినలేదని వ్యాఖ్య 
  • నన్ను చంపే ప్రయత్నం చేశాకే నాగరాజుతో వచ్చేశానని వెల్లడి 
  • చావడానికైనా సిద్ధమని నాగరాజు చెప్పాడంటూ కన్నీరుమున్నీరైన సుల్తానా
హైదరాబాద్ లోని సరూర్ నగర్ నడిరోడ్డు మీద ఓ యువకుడిని అతి దారుణంగా దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. పరాయి మతం వాడిని చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కక్షతో తన అన్నే.. ఆమె భర్తను హతమార్చాడు. నాగరాజు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా తన అన్న గురించి పలు విస్తుపోయే విషయాలను నాగరాజు భార్య ఆశ్రిన్ సుల్తానా చెప్పుకొచ్చింది. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివరాలను వెల్లడించింది.

వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నానన్న కారణంతో తన అన్న మొబీన్ తనను రెండు సార్లు ఉరితీసి చంపేందుకు ప్రయత్నించాడని సుల్తానా చెప్పింది. ఆ తర్వాతే నాగరాజుతో కలిసి హైదరాబాద్ కు వచ్చానని, ఇద్దరం పెళ్లి చేసుకున్నామని వివరించింది. దీంతో తన తల్లి తనను మరిన్ని బెదిరింపులకు గురి చేసిందని పేర్కొంది. చంపేస్తామంటూ బెదిరించిందని తెలిపింది. దాడి చేసినప్పుడు వదిలేయాలంటూ ఎంత వేడుకున్నా తన అన్న కనికరించలేదని కన్నీరుమున్నీరైంది. 

‘చావైనా.. బతుకైనా నీతోనే’ అంటూ నాగరాజు మాటిచ్చాడని ఆమె చెప్పింది. తన అన్నలు చంపేందుకు వెనుకాడరని చెప్పగా.. చావడానికీ సిద్ధమేనంటూ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి కాకముందు ఎన్నో సార్లు వేరే అమ్మాయిని చేసుకోవాలని, తనను పెళ్లి చేసుకుంటే చంపేస్తారని చెప్పినా నాగరాజు వినిపించుకోలేదని సుల్తానా అలియాస్ పల్లవి చెప్పింది. 

తన భర్తపై దాడి జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని సుల్తానా విచారం వ్యక్తం చేసింది. తన అన్న, అతడి స్నేహితుడు పావుగంట నుంచి 20 నిమిషాల సేపు నాగరాజుపై ఇనుపరాడ్డుతో దాడి చేశారని, కత్తితో పొడిచారని చెప్పింది. 

బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సరూర్ నగర్ లోని తహసీల్దార్ ఆఫీసు ముందు సుల్తానా అన్న మొబీన్, అతడి స్నేహితుడు.. బైకుపై వెళ్తున్న సుల్తానా, నాగరాజును అటకాయించి నాగరాజును చంపేసిన సంగతి తెలిసిందే.
Love
Marriage
Wedding
Crime News
Murder

More Telugu News